May 12,2023 13:20

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలో తలపూరు గ్రామ ఆరోగ్య ఉపకేంద్రం వద్ద లింగనిర్థారణ చట్టం, గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య పౌష్టికాహార కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లింగనిర్థారణ చట్టం ఆవశ్యకత గురించి ఆ చట్టం ప్రకారం గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని గర్బిణీ స్త్రీలతో, ఇతరులతో చర్చించి ఎక్కడ కూడా లింగనిర్థారణ పరీక్షలు జరగకుండా చూసే బాధ్యత గ్రామ కమిటీలు చూడాలని చట్టపరంగా ఉన్న చర్యలు తీసుకోవాలని కోరారు. యుక్త వయస్సు రాకుండానే 19 సంవత్సరాలలోపున్నవారికి వివాహం చేయకూడదని, బాలికలకు యుక్త వయస్సు రాకనే వివాహం చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం, వారికి పరిపక్వత లేక బిడ్డను సరిగా చూడలేకపోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య పౌష్టికాహార సమావేశం కూడా నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలో ఎక్కడా నీటినిల్వలు లేకుండ చేయడం దోమలు ఉత్పత్తి కాకుండా వాటిని లార్వా దశలోనే నిర్ములించడం.. అంటే ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి వారానికి ఒకసారి ఇండ్లలో నీటినిల్వలు లేకుండా తీసివేసి ఆరబెట్టి దోమల లార్వ పెరగకుండా చూడటం వంటి చర్యలు చేపట్టాలని తద్వారా దోమల వలన మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలకుండా చూడాలని వివరించారు. గర్బిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేసి వారికి ఆరోగ్యం మెరుగుపడే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ ఓబులేసు, ఈఓఆర్డీ సత్యబాబు, ఎంపీహెచ్‌ ఈ ఓ నాగేశ్వరయ్య, పీహెచ్‌ ఎన్‌ తులసమ్మ, పంచాయతీ సెక్రటరీ మహబూబ్‌ జాన్‌,వి.ఆర్‌.ఓ. స్వర్ణలత, మహిళా పోలీస్‌ వీనిల రేఖ,ఏఎన్‌ ఎమ్‌ లక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి,వరలక్ష్మి, సువర్ణ, ఆశా కార్యకర్తలు నాగరత్నమ్మ, శివలింగమ్మ తదితరులు పాల్గొన్నారు.