ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : మహిళలపై రోజురోజుకి లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు డి పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పాలకొల్లు సమత భవనంలో ఐద్వా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు డి పద్మావతి పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్న మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించిన అవి ఆచరణలోకి రావడం లేదన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి రామభద్రం మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం, ఆశ, హెల్త్ వర్కర్ల జీతాలు కేవలం గౌరవ వేతనంగా, తాత్కాలిక ఉద్యోగులుగా ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరటికట్ల నారాయణమ్మ, ఏలూరు విజయలక్ష్మి, దోర రత్నం,పట్టణ యుటిఎఫ్ అధ్యక్షులు వై ప్రభాకర శాస్త్రి, శ్రీనివాస్,పట్టణ సిఐటియు కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ పలువురు మహిళలు పాల్గొన్నారు.










