నార్పల క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలను చెత్తను తొలగించిన క్రీడాకారులు, వాకర్లు
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలల పాఠశాల క్రీడా మైదానంలో శనివారం హాకీ క్రీడాకారులు పలువురు, వాకర్లు క్రీడా మైదానంలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించి మైదాన పరిసరాల్లో ఉన్నటువంటి చెత్తాచెదారం ను తొలగించారు. క్రీడా మైదానం ప్రహరీ గోడకు అనుకొని ఉన్న నివాసాలవారికి క్రీడామైదానంలోకి మీ ఇళ్లలోని చెత్తను వేయడం వలన ఆ చెత్త కుళ్ళిపోయి వాటిపై దోమలు చేరి మీ ఇళ్లలో ఉండే చిన్నారులు, వృద్ధులకు ప్రాణాంతక వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రతిరోజు పంచాయితీ చెత్త ట్రాక్టర్ వస్తుందని చెత్తను అందులోనే పడవేయాలని క్రీడాకారులు వాకర్లు క్రీడా మైదానం ప్రహరీ గోడ పక్కన ఉన్న స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ శిక్షకులు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి పలువురు వాకర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.










