ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : ఆశా వర్కర్స్ కి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఆశా వర్కర్ల నియమాలలో రాజకీయ జోక్యం ఉండరాదని, సంబంధం లేని ఏ ఇతర పనులు చేయించరాదని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసిల్దార్ ఆఫీస్, డిఎమ్ ఆఫీసుల వద్ద ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహశ్శీల్దార్, డిఎమ్ లకు మెమొరాండాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకఅష్ణ, ఆశా వర్కర్లు పట్టణ కమిటీ సభ్యులు సత్యవాణీ, సిహెచ్. వరలక్ష్మీ లు మాట్లాడుతూ ... ఆశా వర్కర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గత 16 సంవత్సరాలుగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆశాలకు గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో సంక్షేమ పథకాలు ఆపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆశాల స్థానంలో వారి కుటుంబ సభ్యులు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ఆశాలు సేవలు అందించారని గుర్తు చేశారు. కరోనా ప్రభావంతో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయం అనుసంధానం పేరుతో వార్డు, గ్రామ సచివాలయాలకు ఆశాలను దూర ప్రాంతాలకు మ్యాపింగ్ చేయటం, పెరిగిన జనాభా పని భారం, సంబంధంలేని ఆన్లైన్ పనులు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ పనిచేయకపోయినా పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.30 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్, గ్రాడ్యుయేట్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమమునకు సిఐటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను, ఆశా వర్కర్స్ కమిటీ సభ్యురాలు సిహెచ్ వరలక్ష్మి, ఎస్. విజయలక్ష్మి, కె.సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.










