Feb 28,2023 14:38

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ యం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం రిటర్నింగ్‌ అధికారి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మార్చి 13న జరుగు ఎన్నికల నిర్వహణకు నిర్దిష్ట ప్రణాళికతో ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఎటువంటి తప్పులకు తావు లేకుండా పకడ్భందీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన సెక్టోరల్‌ అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ లలో అవసరమైన సదుపాయాలను కల్పించాలని, ఆర్‌డిఓలు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ ను పరిశీలించాలని, పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించిన నెంబర్‌ను పెయింట్‌ చేయించాలని, విద్యుత్‌ సౌకర్యం ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మార్చి 9వ తేది నాటికి పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రిని మొత్తం సిద్ధం చేయాలని, బ్యాలెట్‌ బాక్స్‌ల నాణ్యతను ఖచ్చితంగా ఆర్డిఓలు పరిశీలించాలన్నారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి పోలీస్‌ వారితో సమన్వయం చేసుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వద్ద మరియు కౌంటింగ్‌ సెంటర్ల వద్ద ప్రతి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఓటర్‌ స్లిప్‌లను బిఎల్‌ఓల సహాయంతో ఓటర్లకు అందజేయాలని, పోస్టర్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డిఓలు పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి డిఎస్‌పి, తహశీల్దార్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చిత్తూరు డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, అన్నమయ్య, డిఆర్‌ఓలు, ఆర్‌డిఓలు పాల్గొన్నారు.