Apr 11,2023 13:27

తణుకు రూరల్‌ (పశ్చిమ గోదావరి) : ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు కూలీలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.బళ్ళ చిన వీరభద్రరావు పిలుపునిచ్చారు. మంగళవారం తణుకు మండలం తేతలి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను ఉపాధి హామీ పర్యటనలో భాగంగా కలుసుకొని వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరభద్రరావు మాట్లాడుతూ ... ఉపాధి హామీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో కూలీలు ఉపాధి పనులు చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో వ్యవసాయ పనులు చేయడానికి రావడం లేదని దీనివలన కూలీల కొలత తీవ్రంగా ఏర్పడిందని గ్రామాలలో కొంతమంది పెద్దలు తప్పుడు ప్రసారం చేస్తున్నారని ఇది సరైనది కాదని అన్నారు. సంపద సఅష్టికర్తలు అయిన కూలీల పట్ల ఇలాంటి దుర్మార్గమైన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మాత్రమే కూలీలకు ఉపాధి పనులు చూపిస్తున్న ప్రభుత్వం వ్యవసాయ సీజన్‌ లో కూలీలు ఎవరు పనులకు రావడంలేదని చెప్పడం మంచి కుక్కను చంపడానికి పిచ్చికుక్క అనే ముద్ర వేయడం మానుకోవాలని వీరభద్రరావు హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పని అడిగిన ప్రతి కుటుంబానికి ఎక్కువ రోజులు పని కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని, పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని, ఎండ తీవ్రతను దఅష్టిలో పెట్టుకుని కూలీలకు మజ్జిగ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మారేం వీరాస్వామి, వీరవల్లి దుర్గ భవాని, కోట మోహన్‌ రావు, వెంకటలక్ష్మి, కోటచిన్నమ్మ, తాడిపత్తి కనకం, గుబ్బల దుర్గ, మట్ట ధనలక్ష్మి, తులసి రత్నం, తదితరులు పాల్గొన్నారు.