ప్రజాశక్తి -కుప్పం (చిత్తూరు) : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ.. కుప్పం ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రమీల అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఫేస్ యాప్ ను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, బకాయి ఉన్న రెండు నెలల వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కుప్పం ప్రాజెక్టులో అంగన్వాడిలను వేధిస్తున్న సిడిపిఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వర్కర్ల హక్కులను కాలరాస్తూ, కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్న అధికారిపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కేపీ లలిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సమస్యలు పరిష్కారం కోసం ఫిబ్రవరి 6న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే కార్యక్రమానికి జిల్లాలోని వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ భారీ స్థాయిలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు కస్తూరి శారద లతోపాటు అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











