Jan 28,2023 13:52

చిత్తూరు : టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అనుచిత వ్యాఖ్యలపై పోలీసు సంఘం అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ శాఖపై అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ... పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్‌ చిత్తూరులోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడి అనుచిత వ్యాఖ్యలను పోలీసు విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు మురళి ఖండించారు. విలేకరుల సమావేశంలో పోలీసు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్‌ ప్రసంగించారు.
          నిన్న కుప్పం నుంచి పార్టీ నేత నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కోసం అచ్చెన్నాయుడు సహా పార్టీ నేతలంతా కుప్పంకు చేరుకున్నారు. నిర్ణయించిన ముహూర్తం మేరకే లోకేష్‌ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే, ముందు నుంచి లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి.. బందో బస్తు పైన రాజకీయ వివాదం కొనసాగింది. చిత్తూరు జిల్లా పోలీసులు కొన్ని షరతులతో లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభం వేళ అచ్చెన్నాయుడు కీలక బాధ్యతలు తీసుకున్నారు. అదే సమయంలో సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ... పోలీసులు, ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేశారు. 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని పోలీసులు చెప్పటంపైన స్పందించారు. ఆ సమయంలో పోలీసుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులపై అచ్చెన్నాయుడు అసభ్య పదజాలం ప్రయోగించటంపై కుప్పం ఒన్‌ టౌన్‌ ఎస్సై రవి కుమార్‌ ఫిర్యాదు చేశారు.