Jun 06,2023 10:52
  • ఎగిరిపోయిన ఇళ్లపై రేకులు
  • విరిగిపడిన చెట్ల కొమ్మలు
  • నేలకొరిగిన విద్యుత్‌స్తంభాలు

ప్రజాశక్తి - ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మేఘవృతమై భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండలంలో ఆచంట, కొడమంచిలి, కరుగోరుమిల్లి, వల్లూరు, పెనుమంచిలి తదితర గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగి, పలు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ తీగలపై చెట్లు వాలిపోవడంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి నుంచి విద్యుత్‌ అధికారులు సిబ్బంది ఎంతో కష్టపడి సోమవారం మధ్యాహ్నం విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి.
        కొడమంచిలి పంచాయతీ పరిధి కుక్కలవారిపాలెంలో సానబోయిన శ్రీనివాస్‌ ఇటీవలే కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నాడు. ఆదివారం రాత్రి అకాల వర్షం, ఈదురుగాలులకు ఇంటిపై కప్పు ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఈ సందర్భంగా ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ పరిశీలించి బాధితులకు భరోసా కల్పించి, ప్రభుత్వం పరంగా నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ కె.నరసింహరాజు పాల్గొన్నారు.