సిపిఎస్ ను రద్దుచేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలి : సిపిఎం సిపిఐ
- ఉద్యోగ, ఉపాధ్యాయుకు మద్దతుగా భీమవరంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన
ప్రజాశక్తి-భీమవరం (పశ్చిమగోదావరి) : సిపిఎస్‌ను రద్దుచేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని.. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో వామపక్షాల నాయకులు మద్దతు తెలిపి శుక్రవారం ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆలంపిస్తున్న వ్యతిరేక విధానాలు పట్ల నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ.. ఉద్యోగుల ఉపాధ్యాయులపై కక్ష సాదింపు చర్యలు విడనాడాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉపాద్యాయ, ఉద్యోగుల కోర్కెలు పరిష్కారానికి, వారి న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ఆందోళనలకు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు తెల్పుతున్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు సమస్యలు పరిష్కరించడంలో ప్రభత్వ మొండి వైఖరి విడనాడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగ చేసిన పాదయాత్రలో ఉపాధ్యయ, ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి మాట తప్పను, మడం తిప్పను అని చెప్పి అధికారం చేపట్టాక ఇప్పటివరకూ ఉద్యోగుల సమస్యలను ఇంతవరకూ పరిష్కరించకపోగా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. జీతాలు ఒకటో తారీకు చెల్లించే పరిస్థితి లేదని, పిఆర్సీ కూడా సరైన పద్దతిలో అమలు చేయాలేదని, డిఎలు సంత్సరాల తరబడి బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు. సిపిఐ జల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ కార్మికులు, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాద్యాయులు జెఎసిగా ఏర్పడి చేస్తున్న ఆందోళలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పడిన జెఎసి ఆద్వర్యంలో గత మూడిన్నర సంవత్సరాలుగా న్యాయమైన సమస్యలకోసం ప్రభుత్వానికి, ఎన్నో విజ్ఞాపనలు, వినతులు ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రులు సమక్షంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని దుస్థితి ఏర్పడిదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె.ఎన్.వి గోపాలన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగ రావు, ఎం.సీతారం ప్రసాద్, ఎస్.పుస్పకుమారి, సిపిఎం కార్యకర్తలు డేగ నాగు, కృష్ణ, ముత్యుంజయ, గంటి శ్రీను పాల్గొన్నారు.










