ప్రజాశక్తి-త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా) : హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి మహిళ మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వెల్లంపల్లికి చెందిన యోహానమ్మ కుమార్తె బంక సునీత (30)కు 12 ఏళ్ల క్రితం మండలంలోని రాజుపాలెంకు చెందిన భాగ్యారావుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సునీత వెల్లంపల్లిలోని తన పుట్టింటికి వచ్చారు. ఈ నేపథ్యంలో తల్లితో కలిసి బట్టలు ఉతికేందుకు దిబ్బగిరి వాగుకు వెళ్లారు. అక్కడ బట్టలు ఉతుకుతుండగా వాగు పైనుంచి వెళ్లే విద్యుత్ వైరు తెగిపడి సునీతను తాకడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో యోహానమ్మకు కూడా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు యోహానమ్మను త్రిపురాంతకంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.










