Aug 11,2023 15:15

అనంతపురం : వ్యవసాయ రంగంలో అన్ని విధాల నష్టపోయిన అనంతపురం జిల్లాకు రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ నిధిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి రాంగోపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాయదుర్గంలోని సమైక్యాంధ్ర భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో ప్రధానమైన వేరుశనగ పూర్తిస్థాయిలో పంట విత్తలేదన్నారు. అధికారుల అంచనా ప్రకారం తొమ్మిది లక్షల పదహారువేల ఎకరాల్లో పంట సాగు ఉంటుందని అంచనా వేయగా ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేసినట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయన్నారు. అంతేకాక పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి అరకొర సాయం లభించడం, పంట పండిన రైతుకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ఈసారి ఆశించిన వర్షాలు లేకపోవడం, దీంతో వేరుశనగ పంట సాగు విస్తీర్ణం 62శాతం తగ్గిందన్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా పెరగడం లేదన్నారు. ఆముదం, కందులు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ అది రైతాంగాన్ని ఆదుకునే చర్య కాదన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో పంట సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి జిల్లాకు ప్రత్యేక సహాయ నిధిని విడుదల చేయించాలని డిమాండ్‌ చేశారు కాగా తుంగభద్ర ఎగువ కాలువ వల్ల జిల్లాలో కొంత విస్తీర్ణంలో పంట సాగు అవుతున్నప్పటికీ ఆధునికరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం వల్ల జిల్లాకు రావాల్సిన న్యాయమైన నీటి కోటాను వాడుకోలేకపోతున్నట్లు చెప్పారు. శుక్రవారం బమ్మనహాలు మండలం ఉంతకల్లు వద్ద ఎగువ కాలువకు పడిన గండిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీర్ఘకాలంగా ఎగువ కాలువ ఆధునీకరణ పనులు కొనసాగడం లేదన్నారు. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఇటు ఖరీఫ్లో పంట సాగు, అటు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా జిల్లాకు రావలసిన సాగునీటి కోటాను పూర్తిస్థాయిలో వినియోగించుకులేక పోవడం వల్ల జిల్లాకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు అవుతున్నప్పటికీ చేసిన పనికి కూలీలకు వేతనాలు చెల్లించకపోవడం వల్ల కూలీలకు కూడా తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలోని ఉపాధి హామీ పథకం కింద 18 కోట్ల రూపాయల బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు మొత్తాన్ని చెల్లించకపోవడం వల్ల బకాయిలు అలాగే ఉన్నాయన్నారు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు అనంతపురంలో గురువారం ఓ కార్పొరేటర్‌ తన అనుచరులకు మద్దతుగా 'సెబ్‌' కార్యాలయంలో పోలీసు సిబ్బందిపై దాడి చేయడం ఆందోళనకరం అన్నారు. పోలీసులు నిందితులపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున, నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ, సంగమేశ్‌, మధు తదితరులు పాల్గన్నారు.