Jul 02,2022 09:52

ప్రజాశక్తి-వెదురు కుప్పం (చిత్తూరు జిల్లా) : అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌. వాసుదేవరెడ్డి ఆర్‌.నలిపిరెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వ నియమించింది. ఎన్‌.ఆర్‌.ఐ మెడికల్‌ అఫైర్స్‌ అడ్వయిజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, అలాగే చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్‌ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు ఆశించకుండా పనిచేసేందుకు ఆయన ముందుకు వచ్చారు.
ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని డాక్టర్‌ వాసుదేవరెడ్డి వెల్లడించారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు డాక్టర్లను సమస్వయం చేసి తమ సొంత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా పాటు పాడుతానని వెల్లడించారు. అమెరికాలో అమలవుతున్న అత్యంత అధునాతన వైద్య సేవలు, టెలి మెడిసిన్‌ రంగం ఆంధ్రప్రదేశ్‌కు చేరువ అయ్యేలా పనిచేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో సలహాదారుగా నియమించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ కు ఆయన కతజ్జతలు తెలిపారు.
చిత్తూరు జిల్లా , గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గ పరిధిలో, వెదురు కుప్పం మండలం, బుచ్చిరెడ్డి కండ్రిగ ,వాసుదేవరెడ్డి స్వస్థలం. సిద్దార్థ మెడికల్‌ కాలేజీ విజయవాడలో ఎంబిబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి మెల్‌ బోర్న్‌ (ఫ్లోరిడా రాష్ట్రం)లో వైద్యులుగా స్థిరపడ్డారు. గత 22 రెండేళ్లుగా ఎం.డీ ఫ్యామిలీ మెడిసిన్‌, ఎం.ఎస్‌ పబ్లిక్‌ హెల్త్‌ నిపుణులుగా సేవలు అందిస్తున్నారు ఆయన నియామకం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.