Jul 25,2023 18:08
  •  నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్‌

ప్రజాశక్తి-వికోట(చిత్తూరు) : మండల పరిధిలోని అటవీ సరిహద్దు ప్రాంతం మద్దిమాకులపల్లిలోని పంట పొలాలపై గత మూడు రోజులుగా గజ దాడులు కొనసాగుతున్నాయి. ముధరందొడ్డి పంచాయతీ మద్దిమాకులపల్లి గ్రామ శివారులలోని అటవీ ప్రాంతంలో 14 ఏనుగుల గుంపు పంటపొలాలపై దాడులకు పాల్పడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక అటవీ ప్రాంతం నుంచి 14 ఏనుగుల గుంపు పంటల్లోకి జొరబడి అరటి, మామిడి, మొక్కజొన్న, బొప్పాయి తోటలను పూర్తిగా నాశనం చేశాయి. ఉదయం వెళ్లి చూసేసరికి పంటలు పూర్తిగా ధ్వంసం కావడంతో బాధిత రైతులు కన్నీళ్లపర్యంతమయ్యారు. రాజగోపాల్‌ గౌడుకు చెందిన మొక్కజొన్న, రైతు గోవిందుకు చెందిన మామిడి, సుబ్రహ్మణ్యంకు చెందిన బొప్పాయి, రామకృష్ణారెడ్డి కి చెందిన అరటి, కష్ణమూర్తికి చెందిన స్వీట్‌ కార్న్‌తో పాటు మరో ఐదుమందికి చెందిన వివిధ రకాల పంటలను ఏనుగులు నష్ట పరిచాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పంట నష్టాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు డిఆర్‌ఓ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు పంట పొలాల మీదకు రాకుండా కాపాడాలని రైతులు విజ్ఞప్తి వేశారు. ఈ దాడుల్లో నష్టపోయిన పంటకు ప్రభుత్వం నుండి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.