Oct 26,2023 19:20

మాట్లాడుతున్న నేతలు

ప్రజాశక్తి-నెల్లూరు :విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న నిరసనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పరిశ్రమను ప్రయివేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు నవంబరు 8వ తేదిన విద్యాసంస్థల బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.వి.రమణ పేర్కొన్నారు. గురువారం జేమ్స్‌ గార్డెన్‌ ప్రాంతంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని చేస్తున్న నిరసన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఎంతోమంది విద్యార్థులు యువజనులు పోరాట ఫలితంగా, అమరుల త్యాగాలతో నిర్మించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన బిజేపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని లేదంటే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అదే విధంగా రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి మున్నా, ఏఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్‌ ,పిడిఎస్యు జిల్లా కార్యదర్శి సునీల్‌ ,ఎస్‌ఎఫ్‌ఐ నగర్‌ కార్యదర్శి నరేంద్ర ,డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బీపీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.