8,9 తేదీల్లో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజశేఖర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి నులిపురుగుల నిర్మూలన అత్యంత ఆవశ్యకత ఉందని సెప్టెంబర్ 8,9 తేదీలలో జాతీయ నులిపురుగుల నిర్మూలనదినం సందర్భంగా అందరూ పిల్లలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ అన్నారు. డిఆర్‌ఓ మీటింగ్ హాల్‌లో నేడు నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా అనుసరించాల్సిన ఏర్పాట్లు గురించి వైద్యఆరోగ్యశాఖ, ఇతరశాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఇతర బయట ఉన్న పిల్లలు కలిసి 19 సంవత్సరాల లోపు ఉన్నవారు 3.7లక్షల మంది ఉన్నారని అందరికీ ఈకార్యక్రమం ఏర్పాటు చేయబడిందని అన్నారు. పిల్లలలో ఎక్కువగా శుభ్రత లేకపోవడం వల్ల నులిపురుగులు రావడం జరుగుతుందని వీటిని నివారించడానికి ప్రతి ఆరు నెలలకోసారి ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రను రెండు సంవత్సరాల పైబడి 19 సంవత్సరాల లోబడి ఉన్నవారికి, రెండు సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకు ఆరమాత్ర ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించి కోఆర్డినేటర్‌గా డాక్టర్ సుదర్శన్ ఉన్నారని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల వారందరూ సహకరించుకొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, మానసిక అభివద్ధి మరింత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, సర్వ శిక్ష అభియాన్, ఐసిడిఎస్, మున్సిపల్, 104, 108, జిల్లాలోని అన్ని సామాజిక సంక్షేమ అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, మరియు గ్రామీణ నీటిపారుదల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ మాత్ర షుగర్ కోటెడ్‌గా రావడం జరిగిందని పిల్లలు బాగా నమిలి తినాల్సి ఉంటుందని, అనంతరం వారికి ఇవ్వడానికి నీరు తదితర ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓతో పాటు జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి నాగశైలజ, డాక్టర్ సుదర్శన్ ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందితోపాటు విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.










