Jul 20,2022 22:20

849 గ్రామాల్లో పశువులకు వైద్యసేవలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

వైద్య ఆరోగ్యశాఖలో పలు మార్పులు, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర వైద్యసేవలు, గ్రామీణ ప్రాంతాల్లో 104 సంచార వైద్యసేవలు అందిస్తోంది. నాడు- నేడు పేరుతో ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలు మార్చేందుకు ఈకార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇదే తరహాలో పశువులకు వైద్యం అందించేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. పశువులకు అత్యవస సమయాల్లో వైద్యం అందించేలా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశుఆరోగ్యసేవ వాహనాలను ఈఏడాది మే 19వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. పశుపోషణపనై ఆధారపడి జీవిస్తున్న రైతులకు జీవనాధారమైన పశువులకు సరైన సమయంలో సత్వర వైద్యసేవలు అందించడమే వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్యసేవ లక్ష్యమన్నారు. జబ్బు చేసినా, ఇతర వ్యాధులతో బాధపడుతున్న పశువులకు వద్దకు పశువైద్యులు చేరుకొని ఎలాంటి ప్రాణనష్టం కలుగకుండా జబ్బుపడ్డ పశువులకు వైద్యం అందించాల్సి ఉంటుంది.
జిల్లాకు ఏడు వాహనాల సేవలు..
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశుఆరోగ్యసేవ వాహనాలు చిత్తూరు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వాహనాలను కేటాయించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గాని ఒక వాహనం చొప్పున పశువైద్యశాఖ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం పశువైద్యశాఖ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1962ను ఏర్పాటు చేయబడింది. పశువులకు అత్యవసర వైద్యం అవసరమని గుర్తించిన వెంటనే పశుపోక్షకులు టోల్‌ప్రీ నెంబర్‌కు సమచారం అందించాల్సి ఉంటుందన్నారు. సమీపంలోని సంచార పశుఆరోగ్యసేవ వాహనం స్పందించి తక్కువ సమయంలో రైతు గుమ్మంవద్దకు చేరుకొని పశువు ఎలాంటి ప్రాణహాని జరకుండా వైద్యం అందిస్తారు.
పశుఆరోగ్యసేవ వాహనం అందిచే సేవలు
పశువులకు అత్యవసర వైద్యం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యఆరోగ్యసేవ వాహనాల్లో ప్రధమ చికిత్స, వ్యాధినిర్థారణ, వ్యాధి నివారణ టీకాలు, నట్టలనివారణ మందులు, చిన్న తరహా శస్త్రచికిత్సలతో పాటు కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందించనున్నారు. ఈవాహనంలో ఒక పశువైద్యుడు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, కాంపౌండర్‌, అటెండర్‌ ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశుఆరోగ్య వాహనసేలు ఈ ఏడాది మే 19వ తేదీ నుండీ నేటి వరకు 849 గ్రామాల్లో 1,113 పశువులకు సంచార పశువైద్యసేవలు అందించారు. ఇందులో 436 పశువులకు అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.
పశుపోషకులకు అండగా..
రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అండగా నిలిచేలా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించింది. జిల్లాలో ఏడు వాహనాలు సేవలందిస్తున్నాయి. ఇందుకోసం జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశాం. సమాచారం అందించిన వెంటనే క్షణాల్లో చేరుకొని సేవలు అందించడం జరుగుతోంది. జిల్లాలో 436 పశువులకు అత్యవసర వైద్యం అందించి కాపాడం జరిగింది. మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరిన్ని వాహనాలు జిల్లాకు రానున్నాయి.
-ఎస్‌. వెంకట్రావ్‌, పశుసంవర్థశాఖ జేడి