ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్
ప్రజాశక్తి - భీమవరం రూరల్
ఈ నెల 7వ తేదీ నుంచి 'జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన పోస్టర్లు విడుదల చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక పక్క గడపగడపకూ తిరుగుతూనే, మరో పక్క ఈ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు ఈనెల ఏడో తేదీ నుంచి 14 రోజులపాటు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటుగా వారి సమస్యలను కూడా తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రికి నివేదికల రూపం లో అందిస్తామని తెలిపారు. ఏడో తేదీన పట్టణంలోని ఒకటో వార్డులో కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ ఛైౖర్మన్ తిరుమాని ఏడుకొండలు, జెసిఎస్ కన్వీనర్లు కె. రాంబాబు, చెల్లబోయిన సూర్య ప్రకాష్, నల్లం రాంబాబు పాల్గొన్నారు.










