Sep 20,2023 22:29

డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేస్తున్న రైతు, కౌలురైతు సంఘం నాయకులు

* పంటల బీమాలో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అనుమతి తగదు
* డిఆర్‌ఒకు రైతుసంఘాల వినతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
పంటల బీమాను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతూ ఈనెల 8న ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నంబరు 660ను రద్దు చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, కౌలురైతు సంఘం నాయకులు పోలాకి ప్రసాదరావు, భవిరి కృష్ణమూర్తి, పి.చంద్రరావు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల బీమాలో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రవేశాన్ని నిలిపివేయాలన్నారు. రైతులపై చిత్త శుద్ధి ఉంటే ప్రభుత్వమే పంటల బీమాను అమలు చేయాలన్నారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన తర్వాత పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ కంపెనీలతో బిడ్డింగ్‌ నిర్వహించిందని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను వాతావరణ బీమా 9 క్లస్టర్లుగా, దిగుబడి ఆధారిత బీమా 7 క్లస్టర్లుగా నిర్ణయించి అమలు చేయడానికి జిఒ ఇచ్చిందన్నారు. ఈ జిఒలో పేర్కొన్న పంటల బీమా విధానం రైతులకు నష్టదాయకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రయోజనం కోసం రైతాంగానికి నష్టం చేకూర్చే విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించడం తగదన్నారు. 2020 నుండి 2023 వరకు మూడేళ్ల పాటు పంటల బీమా అమలును పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంటల బీమా అమలు చేసిన 2020-21లో రూ.1700 కోట్లు, 2021-22లో రూ.2,900 కోట్లు రైతులకు పంటల బీమా రూపంలో ప్రయోజనం కలిగిందన్నారు. దీనివల్ల నష్టపోయిన రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందన్నారు. 2022-23లో ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు జరిగిన పంటల బీమా పథకం వల్ల రైతులకు కేవలం రూ.1100 కోట్లు మాత్రమే బీమా పరిహారం వచ్చిందన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల బీమాలో ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు కోసం విడుదల చేసిన జిఒ 660ని తక్షణమే రద్దు చేయాలన్నారు. పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తన బాధ్యతగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి పంటల బీమా పథకంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలను అనుమతించవద్దన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పాలసీ ఇన్సూరెన్స్‌ కంపెనీల లాభాల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదని విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా అమలును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 2022-23లో పంటలు నష్టపోయినా పంటల బీమా అమలు కాని రైతులందరికీ పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.