Oct 01,2023 20:43

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

* జయప్రదం చేయాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణలో భాగంగా ఈనెల ఐదో తేదీన స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఉక్కు రక్షణ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి.సింహాచలం తెలిపారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో అశేష త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లక్ష మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. మరో 25వేల ఉద్యోగాలకు అవకాశముందని తెలిపారు. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం రూ.4,980 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.54 వేల కోట్ల ఆదాయం సమకూర్చిందన్నారు. బంగారు బాతు వంటి ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టిందని తెఇపారు. ప్రజా ద్రోహ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో స్టీల్‌ప్లాంటు కార్మికులు, కార్మిక, ప్రజాసంఘాలు 950 రోజులకు పైగా పోరాడుతున్నారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాల్సిన అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం, అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న జనసేన పార్టీలు మోడీ ప్రభుత్వం ముందు సాగిలపడుతున్నాయని విమర్శించారు. ద్రోహం చేస్తున్న బిజెపిని వదిలేసి, అధికార యావతో తమలో తాము కలహించుకుంటున్నాయన్నారు. మోడీ ప్రభుత్వానికి కావాల్సింది ఇదేనన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి అమ్మాలనే కుట్ర పన్నిందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్లాంటు రక్షణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి సిపిఎం ఈ ఉద్యమంలో తనవంతు కీలకపాత్ర పోషిస్తోందని, ప్రజా ఉద్యమంగా మలిచే కృషి చేస్తోందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల సిపిఎం కార్యదర్శులు రెండు రోజులు దీక్షలు చేపట్టారని, ఈ ఉద్యమానికి విశాల ప్రజా మద్దతు కూడగట్టడానికి సెప్టెంబరు 20 నుంచి ఉక్కు రక్షణ బైక్‌ యాత్ర చేపట్టిందని వివరించారు. 20న విశాఖలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు పర్యటిస్తూ విశాఖలో ముగుస్తుందన్నారు. జాతాకు ఉత్తరాంధ్ర ప్రజానీకం ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. విశాఖ ఉక్కును రక్షించుకోవాలనే స్పందన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే మిగతా ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోలేమన్నారు. ఇదే జరిగితే ఉన్న ఉద్యోగాలు, ఉపాధి పోతుందని, కొత్త ఉద్యోగాలు రావని తెలిపారు. కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి తరగతులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పోరాడాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ఆపకపోతే తగిన గుణపాఠం తప్పదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు నిర్వహిస్తున్న సభలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని స్టీల్‌ప్లాంట్‌ రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.