ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కారానికి ఏఫ్రిల్ 5వ తేదీ నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్.నాగేంద్ర కుమార్, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం గణేనాయక్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజలను విడదీసి పరిపాలిస్తోందన్నారు. అంబానీ, అదాని వంటి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలోతొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశా వంటి స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకూ మద్దతు ధరలు కల్పించాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి సంవత్సరానికి 200 రోజుల పనులు, రోజువారీ వేతనం రూ.600లు ఇవ్వాలన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.నాగమణి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి పాల్గొన్నారు.










