Jun 01,2023 09:23

విలేకరులతో మాట్లాడుతున్న ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ :ప్రపంచ విప్లవకారుడు చెగువేరా 95వ జయంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన అనంత ఆర్ట్స్‌ కళాశాలలో జిల్లా స్థాయి చెస్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యచంద్రయాదవ్‌ తెలిపారు. బుధవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో చెస్‌ ఆట పట్ల ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. పోటీలో పాల్గొనే వారికి ఎటువంటి ప్రవేశ రుసుం లేదన్నారు. కేవలం వారిలోని ప్రతిభను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం, గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలలో పాల్గొనే వారు ఈ నెల 4వ తేదీ లోపు వారి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 9700386070, 9182216213 సెల్‌ నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బాలక్రిష్ణ, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఉదరు కుమార్‌ పాల్గొన్నారు.