Sep 14,2023 23:27

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: అక్టోబర్‌ ఐదో తేదీన చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కన్వీనర్‌ అల్లాడ లక్ష్మి, నగర కన్వీనర్‌ శ్రీదేవి పాణిగ్రహి పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో చలో ఢిల్లీ పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతోన్మాద పాలకులు అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌ వంటి ఘోరకృత్యాలు దేశంలో చోటుచేసుకుంటున్నా కేంద్ర పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వీటితోపాటు విద్యుత్‌ ఛార్జీలు, నిత్యావసరాలు, పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలపై ధరాభారం మోపి అంబానీ, అదానీలకు సబ్సిడీల పేరిట ప్రజా ధనాన్ని వెచ్చిస్తూ సేవ చేయడంలోనే మోడీ తరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణ అని మాయమాటలు చెప్పి, మరింత ఎక్కువ అమ్మకాలు చేపడుతుందే తప్ప మద్యాన్ని నియంత్రించే దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రానున్న ఎన్నికల నేపథ్య దష్ట్యా ప్రజలందరికీ మేలు చేకూర్చే దిశగా ప్రణాళికను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు డి.భానుమతి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు ఎం.లలిత, బి.సుగుణ పాల్గొన్నారు.