
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో నాలుగో విడత కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 5,172 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.7.75 కోట్ల జమ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. కాపునేస్తం వర్చువల్ కార్యక్రమానికి కలెక్టరేటులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఏటా రూ.15 వేలు వంతున ఐదేళ్లకు రూ.75 వేలు అందజేస్తున్నట్లు వివరించారు. లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ ఈ నిధులను సద్వినియోగం చేసుకుని సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, పొందర, కూరాకుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ హైమావతి, బిసి, కాపు కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఆర్.గెడ్డమ్మ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.