Jul 26,2022 21:58

4న కాణిపాకంలో ధ్వజస్తంభ ప్రతిష్ట
ప్రజాశక్తి- ఐరాల:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీస్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఆగస్టు 4వ తేదీన ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకమండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి సురేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కార్యనిర్వహణ అధకారి కార్యాలయం సమావేశమందిరంలో పాలకమండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్యనిర్వాహణాధికారి సురేష్‌బాబు, మాట్లాడుతూ ఆగస్టు 4న జరుగు ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా భక్తులకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఇటువంటి దర్శనం కల్పించడం జరగదన్నారు. అలాగే స్వామివారికి జరిగే ఆర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఆగస్టు నాలుగో తారీఖున భక్తులు రిజర్వేషన్‌ చేసుకున్నటువంటి సేవాకార్యక్రమాలను తర్వాత రోజుకి మార్చుకోవాల్సినదిగా కోరారు. ఆగస్టు 21వ తేదీ మహాచతుర్వేద హవలరహిత మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని, ఆరోజు కూడా భక్తులకు ఇటువంటి దర్శనం భాగ్యం కల్పించడం వీలుకాదని కావున భక్తులు సహకరించాలని కోరారు. 21 కుంబాభిషేకం అనంతరం స్వామివారి మూలవిరాట్‌ను భక్తులకు 24వ తారీఖు నుండి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి 21 వరకు జరుగు ప్రత్యేక పూజలు, మహాకుంభాభిషేకం, కార్యక్రమాలపై ఏఏ సమయంలో దర్శనాలు నిలుపుదల, ప్రోటోకాల్‌, ఆహ్వాన పత్రికలు, పలు అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు గోపి, నరసింహులు శెట్టి, గోవర్ధన్‌, మారుతీశ్వరరావు, రామసుబ్బమ్మ, సుబ్బలక్ష్మమ్మ, సుశీల, సోమశేఖర్‌ గురుకుల్‌, ఏసీ కస్తూరి, ఏఈఓలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీధర్‌ బాబు, కోదండపాణి, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.