Jul 07,2022 22:45

4,876 కేసులు పరిష్కరించాం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

జిల్లాలో లీగల్‌ సర్వీస్‌ కమిటీల ద్వారా 4,876 కేసులను పరిష్కారం చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌జడ్జి ఐ.కరుణ కుమార్‌ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డిఎల్‌ఎస్‌ఏ, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీలతో కలిపి మొత్తం 4,876 కేసులను ఒకే రోజున పరిష్కారం చేసామని తెలిపారు. ఈ దిశగా సహకరించిన న్యాయవాదులకు, పోలీసు వారికి, కక్షిదారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కతజ్ఞతలు తెలిపారు. ఆగష్టు 13న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్‌ అదాలత్‌లు విజయవంతం కావాలంటే కక్షిదారులు నోటీసులతో సంబంధం లేకుండా ముందుకు రావాలని తెలిపారు. ప్రతిరోజు ప్రీ లోక్‌అదాలత్‌ సిట్టింగ్‌లు ఆయా కోర్ట్‌లో జరుగుతోందని, దీని ద్వారా ఆగష్టు 13న జరిగే నేషనల్‌ లోక్‌అదాలత్‌ నిర్వహించే ముందు కక్షిదారులు సమస్యలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. కోవిడ్‌ కారణంగా హైబ్రిడ్‌ విధానంలో ప్రత్యక్షం గానూ, వర్చువల్‌ విధానం ద్వారా లోక్‌ అదాలత్‌లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మోటార్‌ వెహికల్‌ కేసులు, చిన్నపాటి క్రిమినల్‌ కేసులు, 2 లేదా 3లక్షలు లాంటి చెక్‌బౌన్స్‌ కేసులు కక్షిదారులు చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. అలాగే వివాహ సంబంధమైన కేసులలో త్వరితగతిన పరిష్కారం చేసుకుంటే కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఉంటాయని తెలిపారు. గత లోక్‌ అదాలత్‌లో 175 ప్రీలిటికేషన్‌ కేసులు పరిష్కారం అయ్యాయని, బ్యాంకర్స్‌ ప్రీలిటికేషన్‌ కేసుల్లో డిఎల్‌ఎస్‌ఏ కషిచేసి చాలా వరకు సమస్యలను పరిష్కారం చేసిందని తెలిపారు. రాబోయే లోక్‌అదాలత్‌ను ఇదేవిధంగా విజయవంతం చేయాలని ఆయన కోరారు.