Jul 26,2022 21:57

3వ తేదీ నుండి ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు : డిఆర్‌ఓ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయని చిత్తూరు జిల్లాలో 39 పరీక్షాకేంద్రాలలో 11,943మంది పరీక్షలకు హాజరు అవుతారని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ అన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈసందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరంకు సంబంధించి పరీక్షలు రాయడానికి 11943మంది దరఖాస్తులు చేసుకున్నారని దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇందుకోసం హైపవర్‌ కమిటీని నియమించడం జరిగిందని అదేవిధంగా జిల్లా పరీక్షల కమిటీని కూడా నియమించడం జరిగిందన్నారు. ప్రధానంగా ఇందుకు తగిన పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయాలని డిఆర్‌ఓ పోలీసులకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం నందు సీసీ కెమెరాలు ఉంటాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి వస్తువులను సిబ్బందితో సహా లోపలికి అనుమతించడం జరగదని మీడియా వారిని కూడా అనుమతించారని అన్నారు. ఇందుకోసం ప్లైయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని డిఆర్‌ఓ అన్నారు. కోవిడ్‌ నిబంధనలను పాటించడంతోపాటు వైద్య సిబ్బంది మెడికల్‌ కిట్టు తప్పనిసరిగా ఉంచాలన్నారు. పరీక్షలు రెండు పూటల నిర్వహించబడుతుందని ఉదయం పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించబడతాయని అన్నారు. విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని, ప్రజారవాణా సంస్థ వారు పరీక్షా కేంద్రాల వద్దకు బస్సులను నడపాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓతో పాటు ఆర్డీఓ రేణుక, ఆర్‌ఐఓ గోపాల్‌ రెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.