Sep 28,2023 22:27

సమావేశంలో మాట్లాడుతున్న మోహనరావు

* కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని బర్తరఫ్‌ చేయాలి
* సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌ యూనియన్‌ జెఎసి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
లఖింపూర్‌ ఖేరి ఘాతుకం జరిగిన అక్టోబర్‌ మూడో తేదీన బ్లాక్‌ డేగా పాటించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌ యూనియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపునిచ్చింది. నగరంలోని క్రాంతి భవన్‌లో గురువారం నిర్వహించిన జెఎసి సమావేశంలో పలు సంఘాల నాయకులు మాట్లాడారు. 2021 అక్టోబర్‌ మూడో తేదీన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై జరిగిన మారణకాండకు సూత్రధారి అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరుతూ అక్టోబర్‌ 3న జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో బ్లాక్‌ డే నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాట ఫలితంగా నల్ల చట్టాల అమలుకు వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించాలన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవడంతో పాటు ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకు విస్తరించి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహించ తలపెట్టిన బ్లాక్‌ డేని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు సనపల అన్నాజీరావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, ఎఐకెకెఎంఎస్‌ నాయకులు సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.