అనంతపురం ప్రతినిధి : అపరిష్కృతంగానున్న సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 36గంటల నిరసన విజయవంతమైంది. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు నిరసన సాగింది. రాత్రి కూడా కలెక్టరేట్ ఎదుటనే వందలాది మంది అంగన్‌వాడీలు నిద్రించారు. వంటావార్పు కూడా అక్కడే చేసుకుని సాగిన ఈ నిరసన కార్యక్రమం మంగళవారం ముగిసింది. వేతన పెంపు, రిటైర్మంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లతో చేపట్టిన ఈ నిరసనకు సిపిఎం, సిఐటియు, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, కెవిపిఎస్, ఆవాజ్ తదితర ప్రజా సంఘాలు పెద్దఎత్తున మద్దతు తెలిపాయి. అంగన్‌వాడీల 36 గంటల నిరసన కార్యక్రమం కొనసాగింపుగా రెండోరోజు మంగళవారం నాడు జరిగింది. ఉదయం దీక్షా శిబిరం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేసిన నినాదాలు హౌరెత్తాయి. ముగింపు సందర్భంలో కలెక్టరు గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు.
క్యాస్ట్ పాలిటిక్స్ కాదు... క్లాస్ పాలిటిక్స్ కావాలి
వి.రాంభూపాల్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నవి క్యాస్టు పాలిటిక్స్ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సింది క్లాస్ పాలిటిక్స్ అని చెప్పారు. అంగన్‌వాడీల నిరసనకు మద్దతు తెలిపిన తరువాత ఆయన మాట్లాడారు. మహిళలకు పెద్దఎత్తున ఆదుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోందని గుర్తు చేశారు. అయితే ఇక్కడ రెండు రోజులుగా నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు మహిళలు కాదా అని ప్రశ్నించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ప్రతి దానిలోని పక్క రాష్ట్రమైన తెలంగాణతో పోల్చుకునే ప్రభుత్వం వీరి వేతనాల్లో ఎందుకు పోల్చుకోవడం లేదని మండిపడ్డారు. అక్కడ ఇస్తున్న వేతనం రూ.13500 ఉందన్నారు. ఆ మేరకు వేతనాన్ని ఇక్కడా ఇవ్వాలన్న అంగన్‌వాడీల డిమాండ్‌లో న్యాయముందన్నారు. రిటర్మైంట్ తరువాత గ్రాట్యూటీ ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించకపోగా యాప్‌లు, ఇతర పేర్లతో అనేక రకాలుగా అంగన్‌వాడీలను ఇబ్బందులు పెట్టే విధానాలను ప్రభుత్వం అమలు జరుపుతోందని దుయ్యబట్టారు. ఈ విధానాలపై రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీగానీ, అటు జనసేనగా పెదవి విప్పకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత ఉదృతమైన పోరాటాలను, ప్రజాగ్రాహాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
మాట నిలుపుకోని మోడీ
ఓబుళు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
2019 ఎన్నిలకకు ముందు 2018లో అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని ప్రదానమంత్రి నరేంద్రమోడీ హామీనిచ్చారని, అయితే దానిని ఇప్పటికీ ప్రధాని ఆహామీని నిలుపుకోలేదని సిఐటియ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబుళు విమర్శించారు. మోడీ హామీ ఇచ్చిన మేరకు ఇప్పటికీ అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగన్‌వాడీల వేతనాలను తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఆమాటను ముఖ్యమంత్రి నిలుపుకోలేదని విమర్శించారు. ఒకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. అందుకు తగ్గట్టు వేతనాల్లో పెరుగుదల లేదని పేర్కొన్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడే వారికి సరైన పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు కేటాయించే నిధుల్లోనూ కేంద్ర ప్రభుత్వం 30 శాతం కోత విధించిందని పేర్కొన్నారు. దేశంలో శిశు మరణాల సంఖ్య అధికంగా ఉంటున్న తరుణంలో అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచిస్తోందన్నారు. కాని ఈ పాలకులకు కేంద్రాల నిర్వహణపైగానీ, ఇందులో పనిచేసే సిబ్బంది సంక్షేమం గురించి ఏ మత్రం పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. అందుకే పోరాటాలతోనే ఈ సమస్యలను పరిష్కరించుకోగలమని చెప్పారు. ప్రభుత్వాలు దిగిరాకపోతే తగిన రితీలో బుద్ధిచెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అంగన్‌వాడీలకు సిపిఎం నగర కమిటీ మద్దతు
అంగన్‌వాడీ కార్మికులు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు సిపిఎం నగర కమిటీ మద్దతు తెలిపింది. వీరికి మద్దతు నగరంలో బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శిబిరం వద్దకొచ్చి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనంతపురం మొదటి, రెండో కమిటీ కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, ఆవాజ్ నాయకులు వలి, బాబు, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిరసన దీక్షలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమణి, నాగేంద్రకుమార్, ఎపి అంగన్‌వాడీ వర్కర్సు అండ్ హెల్పర్సు యూనియన్ జిల్లా అధ్యక్షులు శకుంతల, ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప, సిఐటియు నాయకులు రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.










