Jul 29,2023 22:28

కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

           అనంతపురం : విభజన హామీల్లో భాగంగా కడపలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 31వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. శనివారం స్థానిక గణేనాయక్‌ భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఒ.నల్లప్ప, బాలరంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాట చేస్తామన్న హామీని బిజెపి తుంగలోకి తొక్కిందన్నారు. పార్లమెంటులో ఇటీవల చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమైందన్నారు. సెయిల్‌ ద్వారా అధ్యయనం చేస్తున్నామని ఇంతకాలం ప్రకటించిన కేంద్రం ఇప్పుడు చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ ఇక్కడ అనువు కాదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం రంగ సంస్థకే సాధ్యం కానప్పుడు ప్రయివేటు సంస్థ ఇక్కడ ఏరకంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబడానికి ముందుకొచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వ హయంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఒకసారి శంకుస్థాపన చేయగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి చేసారన్నారు. తాజాగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రెండుసార్లు శంకుస్థాపనలు చేసారని గుర్తు చేశారు. ఇది కేవలం శంకుస్థాపనలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా అధికార వైసిపి నోరు మెదపటం లేదని విమర్శించారు. పైగా ఆ పార్టీకి అవసరమైన మద్దతును అందిస్తూనే ఉందని తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వక పోయినా, ప్రత్యేక హోదా లేకపోయినా, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నా ఇలా అన్ని రకాలుగా రాష్ట్రానికి నష్టం చేకూరుస్తున్నా పల్లెత్తు మాట కేంద్రంలోని బిజెపిని వైసిపి ప్రభుత్వం అనకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన పార్టీల పరిస్థితి ఇదే రకంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీల వైఖరిని ప్రశ్నిస్తూ ఈనెల 31వ తేదీన కడప ఉక్కు పరిశ్రమకై పోరాటాన్ని చేపట్టాలని సిపిఎం పిలుపునిస్తోందని చెప్పారు. అందులో భాగంగా 31వ తేదీన అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట జరిగే నిరసనలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కేంద్రం వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.