Feb 21,2022 23:52

దుంగలను చూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
ప్రజాశక్తి- తిరుపతి మంగళం :
చిత్తూరు జిల్లాలో తిరుపతి పరిసరాల్లో టాస్క్‌ఫోర్స్‌ వరుసగా జరిపిన దాడుల్లో గత మూడు రోజుల్లో 31 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాట్లు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్‌పోర్స్‌ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. సోమవారం కఫిలతీర్థం వద్ద ఉన్న టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో విలేకర్లతో ఎస్పీ మాట్లాడారు. తమ బృందాలు మూడురోజుగా డీఎస్పీ మురళీధర్‌, ఆర్‌ఐ సురేష్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారని తెలిపారు. సోమవారం తెల్లవారు జామున ఆర్‌ఎస్‌ఐలు విశ్వనాథ్‌, వినోద్‌కుమార్‌ బృందాలు రేణిగుంట మండలం తిమ్మినాయుడు పాలెం పరిధి అడవిలో కూంబింగ్‌ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళ్తూ వారికి తారస పడ్డారని, వారిని చుట్టుముట్టగా దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని పట్టుకున్నారని తెలిపారు. వీరిని తమిళనాడు వేలూరు జిల్లా, పెంజమానదైకు చెందిన పి.రాజేంద్రన్‌(41), కె.కుమార్‌(35)లుగా గుర్తించామన్నారు. వీరి నుంచి పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఈనెల 20వ తేదీన ఆర్‌ఎస్‌ఐ లింగాధర్‌ బందం శ్రీవారి మెట్టు సమీపంలో 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజంపేట డివిజన్‌ ఓబులవారిపల్లి ముసలి కుంట వద్ద ఆర్‌ఐ కపానంద 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ 31 ఎర్రచందనం దుంగలు 836 కిలోలు ఉంటాయని, విలువ సుమారు రూ.40లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ కేసులని సిఐ చంద్రశేఖర్‌ దర్యాప్తు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఓ ప్రేమ, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.