ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రైతుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30న విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని గణేనాయక్ భవన్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలన్నారు. 2022 ఖరీఫ్ రబీ సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ పంటల బీమా విడుదల చేయాలని, 0 వడ్డీ పథకం 2 లక్షలకు, పావలా వడ్డీ పథకం ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కనీసం పెట్టుబడులు కూడా చాలడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ధరలపై అదనంగా రూ.20 బోనస్‌గా ఇవ్వాలని కోరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే పద్ధతిని నిలుపుదల చేసి ఉచిత విద్యుత్‌ను యథావిధిగా కొనసాగించాలన్నారు. డ్రిప్‌చ స్పింక్లర్లకు జీఎస్టీని రద్దు చేసి ప్రతి రైతుకూ 90 సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో కౌలు రైతులందరికీ గ్రామసభల ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలకు వర్తింజేచేయాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నాకు జిల్లా నుంచి రైతు సోదరులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరసింహారెడ్డి, వన్నూరప్ప, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి










