Sep 26,2023 21:47

సూచనలు చేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: 
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రూపొందించిందని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. మండలంలోని అల్లినగరం గ్రామ సచివాలయంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోగాత్మక వైద్య శిబిరంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని, ఈనెల 30వ తేదీ నుంచి పకడ్బందీగా ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించే క్యాంపెయిన్‌ సాగుతోందన్నారు. ఎఎన్‌ఎం, సిహెచ్‌ఒ, ఆశా వర్కర్‌, వాలంటీర్లు రెండు బ్యాచ్‌లుగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి అక్కడే ఏడు రకాల పరీక్షలు చేసి ఆరోగ్య వివరాల నివేదికలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారని చెప్పారు. పరీక్షల నివేదికలు వైద్య శిబిరాలు నిర్వహించే నాటికి వైద్యులకు అందుబాటులో ఉండేలా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాలకు మూడు రోజుల ముందు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు కలిసి గృహ సందర్శన చేసి ప్రజలకు వైద్య శిబిరం వివరాలు తెలపాలన్నారు. జిల్లా, మండల, మున్సిపాల్టీ వారీగా అధికారులు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేసి ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటుతో ఒక ఆరోగ్య కార్యకర్త వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన ప్రజలకు రిజిస్ట్రేషన్‌ మొదలు ఒపి చీటీ అందజేయడం, సంబంధిత డాక్టర్‌ రూమ్‌ చూపడం మందులు తీసుకుని వెళ్లే వరకు సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.