Jul 16,2023 22:36

ప్రజాశక్తి - కాళ్ల
               కాళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల విరాళాలతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆదివారం కాళ్ల హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు (1992-1993) హైస్కూల్లో కలిసి తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసిన కాళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమపై కురిపించిన ఆప్యాయతతో 80 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయులు ఉప్పొంగిపోయారు. దేశ, విదేశాల్లో వివిధ వృత్తులు, వ్యాపారులు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం జీవితాంతం ఉంటుందని విద్యార్థులు అన్నారు. సుమారు 160 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. వాట్సాప్‌ గ్రూపు ద్వారా ఒక వేదిక పైకి పాఠశాలలో కలిసి చదువు చెప్పిన గురువులను సత్కరించారు. చాలా మంది పూర్వపు విద్యార్థులు సతీ సమేతంగా మరి కొంతమంది భర్తలతో కలిసి వచ్చారు. విద్యార్థి దశలో మరపురాని జ్ఞాపకాలను నెమరు వేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. విద్య నేర్పిన పాఠశాలకు విద్యుత్తు, వైఫై, కుర్చీలు వంటి సౌకర్యాలు నిమిత్తం రూ.60వేలు అందించారు.