ప్రజాశక్తి-అనంతపురం సిటీ వచ్చేనెల 3వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరామ్ తెలిపారు. మంగళవారం నగరంలోని కెఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏసీ గోవిందనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 139 పరీక్ష కేంద్రాల్లో 35,310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇప్పటికే ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించి భద్రపరిచామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బంది ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. ఉదయం 9:30 గంటల నుండి 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీలు జరగకుండా ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, అవసరాన్ని బట్టి సిట్టింగ్ స్క్వాడ్స్, 139 మంది చీఫ్ సూపర్డెంట్లు, 139 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, దాదాపు 1500 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న డిఇఒ ఎం సాయిరాం










