
* బస్సు యాత్రను జయప్రదం చేయాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: ప్రజా రక్షణ భేరి బస్సుయాత్రను నవంబరు రెండో తేదీన మందసలో ప్రారంభించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తెలిపారు. సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్ ప్రారంభించే ఈ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన కర్నూలు జిల్లా ఆదోని, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో బస్సు యాత్రలు ప్రారంభమై, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అత్యధిక ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి పాలనలో మొత్తం దేశం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మత విద్వేషాలు సృష్టిస్తున్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రధానమైన కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు రాష్ట్ర సంపద అంతా ఒక్కొక్కటిగా అదానీకి కట్టబెడుతున్నా వైసిపి, టిడిపి పల్లెత్తి మాట్లాడటం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజరు పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన బిజెపి, అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారైందని విమర్శించారు. సమావేశంలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు, బి.వాసు, పోలయ్య, బొంతు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.