29న విజయవాడ మహా ధర్నా ను జయప్రదం చేయండి
ప్రజాశక్తి -పలమనేరు: దేశ వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న అన్నిరకాల సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్ తో గల్లీ నుండి ఢిల్లీ దాకా దళితులను చైతన్యం చేయడం లో భాగంగా కెవిపియస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వాన దళిత రక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నూర్ ఈశ్వర్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు తెలిపారు. పలమనేరు సిఐటియు కార్యాలయంలో శుక్రవారం మహాధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయినా కుల వివక్ష అనేక రూపాల్లో వుందన్నారు. దళిత చట్టాలను నీరుగార్చే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయన్నారు. దళితులు ఐక్యంగా ఉద్యమించి దళిత చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సి ఆర్ పి సి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి తన మతోన్మాదపు విధానాలతో మనువాదాన్ని తిరగదోడి దళితులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అందులో భాగంగానే అభివద్ధి మాటను పక్కన పెట్టిన బిజెపి, కులం పేరుతో, మతం పేరుతో, సంప్రదాయం పేరుతో, తినే తిండి పేరుతో వైసమ్యాలను సష్టిస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటోందన్నారు. రాష్ట్రంలో దళితులు ఓట్లకు తప్ప దేనికి పనికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆధిపత్య వర్గాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నా.. వారిని కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కనివ్వకుండా అధికార మదంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రతిపక్ష సహకారం దొరుకుతోందేమో అని ఎదురుచూస్తున్న దళితులకు, పాలనకు సంబంధించి మేమూ ఆ తానులోని గుడ్డలమే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పెరిగిపోతున్న ఈ ఆర్థిక, సామాజిక అంతరాలను బద్దలు కొట్టే విధంగా దళితులంతా ఒక్కటై ఐక్యంగా ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈనెల 29వ తేదీ విజయవాడలో జరిగే మహా ధర్నా ద్వారా మన శక్తి ఏంటో చూపాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు భువనేశ్వరి, గిరిధర్ గుప్తా ,కెవిపిఎస్ మండల కార్యదర్శి పాకాల సుబ్రహ్మణ్యం, ధనమ్మ, రాణి, సుజాత పాల్గొన్నారు.










