
*విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా నిరసన
*జయప్రదం చేయాలి : వామపక్షాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ భారాలకు నిరసనగా ఈనెల 27వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, బి.శ్రీరామ్మూర్తి తెలిపారు. ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అధ్యక్షతన నగరంలోని క్రాంతిభవన్‌లో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వడ్డీ పేరుతో మరో రూ.1500 కోట్లు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు విద్యుత్‌శాఖ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని అదానీ, కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి పూనుకుందని విమర్శించారు. రైతులకు పంపుసెట్లకు 30 ఏళ్ల పాటు విద్యుత్ ఇవ్వడానికి ఇప్పటికే అదానీతో ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఇప్పటికే అధిక ధరలు, అదనపు భారాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వడ్డీ పేరుతో మళ్లీ విద్యుత్ భారాలు వేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు, శ్లాబులు మార్చి భారాలు మోపడం, ట్రూ అప్, ఇంధన, కస్టమర్, ఫిక్స్‌డ్, సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్ సుంకం పెంచడం, సర్దుబాటు ఛార్జీల పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జమా ఖర్చులపై విచారణ లేకుండానే యూనిట్‌కు అదనంగా 40 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు ఛార్జీల భారాలను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు కె.భాస్కరరావు చిక్కాల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.