Jul 13,2023 08:46

మద్యం ఫుల్‌

         అనంతపురం క్రైం : వైసిపి అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని తీసుకుని వచ్చి, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. దీంతో ఎక్సైజ్‌ అధికారులకు గతంలో ప్రయివేటు మద్యం షాపుల నుంచి వచ్చే మామూళ్లకు బ్రేక్‌ పడింది. మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో ఎక్సైజ్‌ అధికారులు బార్లను ఆదాయ వనరులుగా మార్చుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిలో అనంతపురం నగరంలోనే 10 ఉన్నాయి . నిబంధనల మేరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 వరకు మద్యం అమ్మకాలు నిర్వహించాలి. కానీ బార్లన్నీ తెల్లవారుజామున 5 గంటలకే అధికారికంగా తెరుచుకుంటున్నాయి. దీన్ని నివారించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు కనీసం ఆ వైపునకు తొంగి చూడటం లేదంటే మామూళ్లు ఏ స్థాయిలో అందుతున్నాయో ఇట్టే అర్థమవుతోంది.
ఇష్టారాజ్యంగా మద్యం ధరలు

సాధారణంగా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్మకాలు నిర్వహిస్తారు. కానీ బార్లలో ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.150 వరకూ బ్రాండ్లను బట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపైనా ఎక్సైజ్‌ అధికారుల చర్యలు శూన్యమనే చెప్పాలి. దీనికి తోడు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బార్ల గేట్ల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుల ద్వారా రాత్రంతా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉదయం 5 గంటలకే అధికారికంగా బార్లు బార్లా తెరుస్తున్నా ఎక్సైజ్‌ అధికారులకు కనిపించడం లేదంటే అందులోని మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి.
బార్లను పరిశీలిస్తాం
ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కుమరేశ్వరన్‌

బార్లను నిబంధనల మేరకే నిర్వహించాలి. ప్రభుత్వం సూచించిన సమయంలో మాత్రమే విక్రయాలు జరపాలి. అలాకాకుండా ముందుగా తెరిచినా, సమయం దాటిన తరువాత తెరిచి ఉంచినా చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బార్లపై చర్యలు తీసుకుంటాం.