అనంతపురం కలెక్టరేట్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు 'ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర'ను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్లను గురువారం నాడు అనంతపురంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వాటి పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సైకిల్‌యాత్రను నిర్వహించి ప్రభుత్వాలను కదిలించడం స్వాగతించదగిన పరిణామం అన్నారు. సైకిల్ యాత్ర ఆగస్టు 23వ తేదీ తాడిపత్రి పట్టణంలో ప్రారంభమై గుత్తి, గుంతకల్, వజ్రకరూరు, ఉరవకొండ, కనేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మీదుగా అనంతపురం పట్టణానికి 30వ తేదీ చేరుకుంటుందన్నారు. జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న కనీసం ప్రహరీ నిర్మాణం కూడా పూర్తి చేయలేని దుస్థితి ఉందన్నారు. యూనివర్సిటీకి సంబంధించి అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదన్నారు. విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సంక్షేమ హాస్టల్ భవనాలకు పెచ్చులూడిపోయి శిధిలావస్థకు చేరినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను ఇవ్వలేదన్నారు. శింగనమల, ఉరవకొండ, తాడిపత్రి, ఆత్మకూరు, గుత్తి, జూనియర్ కళాశాలలో సరైన సదుపాయాలు లేవన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి అనుబంధ హాస్టళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కస్తూరిబా గర్ల్స్ విద్యాలయాల్లో సీట్లకు డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా సీట్లు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కొన్ని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై లైంగిక దాడులు జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకరం అన్నారు. డిగ్రీ విద్యకు సంబంధించి మేజర్, మైనర్ సబ్జెక్టు విధానాలు తీసుకొచ్చి నాలుగేళ్ల వ్యవధికి పెంచి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా నారాయణ, శ్రీచైతన్య ఇతర కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు అడ్డగోలుగా పెంచి వసూలు చేస్తున్నా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల స్పందన లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ యాత్రకు మేధావులు, విద్యార్థులు, సంఘీభావం తెలిపి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత, జిల్లా నాయకులు తరిమెల గిరి, రాచేపల్లి సూర్యప్రకాష్, శివ, వర్ధన్ పాల్గొన్నారు.










