Sep 20,2023 22:23

విద్యుత్‌ వినియోగదారులతో మాట్లాడుతున్న సత్యనారాయణ

* విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్‌ సత్యనారాయణ
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: 
తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో ఈ ఏడాదిలో వినియోగదారుల నుంచి 316 సమస్యలు రాగా, అందులో ఇప్పటికే 219 పరిష్కరించామని, ఈనెలాఖరుకు మిగతా వాటినీ పరిష్కరించనున్నట్టు విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సిజిఆర్‌ఎఫ్‌) చైర్మన్‌, విశ్రాంత న్యాయమూర్తి బి.సత్యనారాయణ అన్నారు. స్థానిక విద్యుత్‌శాఖ కార్యాలయంలో విద్యుత్‌ వినియోగదారుల అవగాహనా సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యుత్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తే సిజిఆర్‌ఎఫ్‌ దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కరించుకోవచ్చునన్నారు. కార్యాలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోతే 1912 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. ఇపిడిసిఎల్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు ఎక్కువగా వచ్చాయని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి తక్కువ సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది సిజిఆర్‌ఎఫ్‌ ద్వారా 101 మంది లబ్ధిదారులకు రూ.5.49 లక్షల నష్టపరిహారం చెల్లించామన్నారు. కోటబొమ్మాళిలో మూడు కేసులు విచారించామని, ట్రాన్స్‌ఫార్మర్‌ మార్చాలని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని, హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లను మార్చాలని, చీపుర్లపాడులో పాఠశాలపై విద్యుత్‌ లైన్లు మార్చాలని ఫిర్యాదు చేశారన్నారు. అంతకుముందు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు విద్యుత్‌ సమస్యలు, పరిష్కారంపై న్యాయస్థానాన్ని అశ్రయించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిజిఆర్‌ఎఫ్‌ ఆర్థిక సభ్యులు ఎస్‌.హరిబాబు, స్వతంత్ర సభ్యులు, విశ్రాంత సంచాలకులు ఎపి స్టడీ సర్కిల్‌ రాయసం సురేంద్రకుమార్‌, విద్యుత్‌శాఖ డిఇ శంకరరావు, ఎఇ జి.వెంకట సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.