Jun 28,2023 21:43

అమ్మఒడి మెగా చెక్కును అందజేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

          అనంతపురం : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి కింద అనంతపురం జిల్లాలో 2,13,394 మంది తల్లుల ఖాతాల్లోకి సుమారు రూ.277.41 కోట్ల నగదును ప్రభుత్వం జమ చేసింది. 4వ విడత జగనన్న అమ్మఒడి జిల్లాస్థాయి కార్యక్రమాన్ని నగరంలోని కెఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయదుర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, నగర మేయర్‌ వసీం, అహుడా ఛైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎల్‌ఎం.ఉమాదేవి, ఎడిసిసి ఛైర్మన్‌ లిఖిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ విద్యకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదరికంతో విద్యకు ఎవరూ దూరం కాకూడదన్న ఉద్ధేశంతో అమ్మఒడి ద్వారా ప్రతి ఏడాది తల్లుల ఖాతాల్లో రూ.15వేలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందని చెప్పారు. కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ విద్యతోనే బంగారు భవిష్యత్తు లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులు అమ్మఒడి మెగా చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం, డిప్యూటీ డిఇఒ పద్మప్రియ, శంకర ప్రసాద్‌, డిఈవిఒ వెంకటరమణ నాయక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.