
* రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు
శ్రీకాకుళం అర్బన్ : ఐక్య ఉపాధ్యాయ సంఘం (యుటిఎఫ్) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకు స్వర్ణోత్సవ జాతా నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు తెలిపారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘం మధ్యంతర కౌన్సిల్ సమావేశం అధ్యక్షులు పొందూరు అప్పారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముందుగా యుటిఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సంతాప తీర్మానాలు, నివేదికను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్, ఆర్థిక నివేదికను కోశాధికారి బి.శ్రీరామ్మూర్తిలు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుటిఎఫ్ ఆవిర్భవించి 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాతా ఈ నెల 21న ఇచ్ఛాపురంలో ప్రారంభమై సోంపేట, హరిపురం, పలాస, టెక్కలి నరసన్నపేట, శ్రీకాకుళం వరకు సాగుతుందన్నారు. కిషోర్‌కుమార్ మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్ రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ అనంతరం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఉద్దేశపూర్వకంగానే విషం చిమ్ముతున్నారని,రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ చేపడతామని జెవివి రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షులు ఎల్.బాబూరావు, జిల్లా కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి హనుమంతు అన్నాజీరావు, పి.సూర్యప్రకాశరావు, జి.సురేష్ పాల్గొన్నారు.