Jul 05,2023 20:52

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
చెడు వ్యసనాలకు బానిసై అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులను అరెస్టు చేసి 21 కిలోల గంజాయిని, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ తెలిపారు. బుధవారం స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్‌ ఫ్రీ జిల్లాగా పశ్చిమను మార్చేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో డ్రగ్స్‌ సరఫరా చేసేవారిపై, డ్రగ్స్‌ వినియోగించే వారిపై, అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. దీంతో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బైపాస్‌ రోడ్డు, స్థానిక సిద్ధార్థ ఐటిఐ కళాశాల రోడ్డు, అనాకోడేరు కాలువ గట్టు, ఆకివీడుకు చెందిన హనుమంతరాజు ఖాళీ స్థలంలో నలుగురు యువకులు గంజాయి సేవిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్‌ఐ రాంబాబు, సిబ్బంది వారిపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం పోర్చాలబ్బు గ్రామానికి చెందిన అరబీర్‌ విజయకుమార్‌, పాలకొల్లు పట్టణం శంభునిపేటకు చెందిన మేళం పవన్‌కుమార్‌, భీమవరం పట్టణం దుర్గాపురానికి చెందిన గూడూరి దుర్గప్రసాద్‌, పొట్నూరి గణేష్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21 కిలోల గంజాయి, రూ.21 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటి విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 52 గంజాయి కేసులు నమోదయ్యాయని, 236 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఐదుగురుపై పీడీ యాక్ట్‌ కేసు పెట్టామన్నారు. అయితే గంజాయికి అలవాటు పడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో దఫదఫాలుగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌పి శ్రీనాధ్‌, సిఐ బి.కృష్ణకుమార్‌, ఎస్‌ఐలు రాంబాబు, అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.