Sep 26,2023 21:44

సంతకాలను సేకరిస్తున్న ఐద్వా నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ను 2024 సంవత్సరం నుంచే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో కెఎస్‌ఆర్‌ బాలికల పాఠశాల ఎదుట సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి రిటైర్డ్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి రమాదేవి, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, డాక్టర్‌ ప్రసూన, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు హాజరై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ భారత ప్రభుత్వం చట్టం చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే దీనిని త్వరగా అమలు చేస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు. రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు మాట్లాడుతూ 76 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత మహిళలకు చట్టం రావడం హర్షణీయం అన్నారు. జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన మాట్లాడుతూ 2024 నుంచి మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల కోసం కాకుండా ఇప్పటి నుంచే దీనిని అమలు చేయాలన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ రిజర్వేషన్‌ కోసం మహిళా లోకం చేసిన పోరాట ఫలితంగా రిజర్వేషన్‌ కల్పిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లు ఆమోదించారని తెలిపారు. 2029లో మహిళా రిజర్వేషన్‌ అమలులోకి వస్తుందని చెప్పడం సరికాదన్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు పార్లమెంట్‌లో బిల్లు పెట్టి అమలు కానీ దుస్థితిని చూశామన్నారు. కావున 2024 నుంచే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో 26వ తేది నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 5వ తేదీన ఢిల్లీలో మహాధర్నా నిర్వహించి, సంతకాలను కేంద్రానికి అందజేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 2వ తేదిన అనంతపురం నుంచి ఐద్వా నేతలు ఢిల్లీ మహాధర్నాకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.