ప్రజాశక్తి-ఉరవకొండ 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమాను వెంటనే ప్రకటించాలని సిపిఎం వజ్రకరూరు మండల కన్వీనర్ విరుపాక్షి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు చిన్నహోతూరు, పెద్దహోతూర్ గ్రామాల్లోని సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అనంతరం ఆయా సచివాలయాల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టి కారణాల వల్ల రైతులు సాగుచేసిన వేరుశెనగ, పత్తి, మిరప, కంది, తదితర పంటలు పొల్లాలోనే కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు చాలామంది దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఫలితంగా కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో వేరుశనగ రెండు లక్షల హెక్టార్లలో, పత్తి 77 వేల హెక్టార్లలో, మిరప 27 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. 2021లో పెండింగ్‌లో ఉన్న పంటల బీమా రూ.39 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నిరకాల విత్తనాలతోపాటు ఎరువులు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా సీ2 ప్లస్ 50 శాతం ఫార్ములా ప్రకారం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. చీనీ, మామిడి, నిమ్మ పంటల అమ్మకాల్లో మారెట్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి అభ్యంతరకరంగా నిర్మించ తనిపెట్టిన అప్పర్ భద్ర నిర్మాణ అనుమతులను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజేష్, దేవేంద్ర, రైతుసంఘం నాయకులు నాగరాజ్, గోపాల్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు










