Sep 16,2023 23:01

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

* జయప్రదం చేయాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్‌ యాత్రను ఈనెల 20 నుంచి 29వ తేదీ వరకు చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, జి.సింహాచలం తెలిపారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఉక్కు రక్షణ యాత్ర పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాత్ర 20న విశాఖపట్నంలో ప్రారంభమై 22న ఎచ్చెర్ల చేరుకుంటుందన్నారు. 22, 23 తేదీల్లో జిల్లాలో బైక్‌ యాత్ర సాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట మీదుగా ఇచ్ఛాపురం వెళ్లి మందస, పాతపట్నం, కొత్తూరు మీదుగా సాగుతుందని వివరించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో సుమారు 1200 కిలోమీటర్లు సాగి 29వ తేదీన స్టీల్‌ప్లాంట్‌ వద్ద చేపడుతున్న నిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుందని చెప్పారు. యాత్ర ముగింపు సందర్భంగా 29న సాయంత్రం ఐదు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్ర ప్రారంభానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ముగింపు సభకు అఖిల భారత నాయకులు హాజరవుతారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే, రాబోయే కాలంలో పెద్దఎత్తున ప్రతిఘటన తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా, అధిక ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్నా ఛత్తీస్‌ఘడ్‌లోని ఎన్‌ఎండిసి నుంచి కొనుగోలుకు అనుమతించడం లేదన్నారు. దూర ప్రాంతంలోని కర్నాటక నుంచి కొనుగోలు చేసుకోవాలని చెప్పడం స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టాలన్న కుట్రలో భాగమేనన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి సరుకులు అన్‌లోడ్‌ చేయకుండా పక్కనే ఉన్న అదానీకి చెందిన గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పాలకుల మెడలు వంచి పోరాడి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను తిరిగి అటువంటి పోరాటాల ద్వారానే రక్షించుకోవడం సాధ్యమన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజలు సహించేది లేదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణ త్యాగాలతో, 16 వేల మంది రైతుల త్యాగఫలంగా సాధించుకున్న ప్లాంట్‌ను రక్షించుకుని తీరుతామన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను కాపాడుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలమన్నారు. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుందన్నారు. రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, మెట్రో రైలు, రైల్వేజోన్‌, విద్యాసంస్థల నిర్మాణం నేటికీ ఆచరణ రూపం దాల్చలేదన్నారు. ఈ దిశలో ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యపరచడానికి ఈ యాత్ర చేపట్టామని తెలిపారు.