అనంతపురం కలెక్టరేట్ : అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు స్వచ్ఛత హి సేవలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట కార్యక్రమం కింద శ్రమదానం చేపట్టాలని కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరు ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక బందాలు, ఎన్‌సిసి సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామీణ యువత, యూత్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని శ్రమదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుంచి చెత్తను తొలగించాలన్నారు. అక్టోబర్ ఒకటో తేదీన చేపట్టే శ్రమ దానం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలన్నారు. ఈ నెల 30వ తేదీన శానిటేషన్ వర్కర్లకు, క్లాప్ మిత్రాలకు ప్రత్యేకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మెడికల్ క్యాంపులు నిర్వహించి స్పెషలిస్ట్ డాక్టర్లతో మెడికల్ చెకప్ చేయించాలని డిపిఒకు కలెక్టర్ సూచించారు.
29 కంబదూరులో జగనన్నకు చెబుదాం
ఈనెల 29వ తేదీన కంబదూరులో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. కంబదూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జగనన్నకు చెబుదాం, స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఇందులో పాల్గొంటారన్నారు. కంబదూరు మండల ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.










