మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు
19న విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా 'ప్రజా బ్యాలెట్'
-సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్
ప్రజాశక్తి-నెల్లూరు:విద్యుత్తు సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేరుతో విద్యుత్తు ఛార్జీలను పెంచి ప్రజలపై ఆర్ధిక భారాలను మోపుతుందని, విద్యుత్తు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సంయుక్తంగా ఈ నెల 19వ తేదిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా సిపిఎం కార్యాదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. మంగళవారం బాలాజీనగర్ సిపిఎం కార్యాలయంలో వామపక్షపార్టీల ప్రతినిధులు విలేకర్ల సమవేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణలు తీసుకురావడం, వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపి అమలు చేస్తుందన్నారు. బిజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ విద్యుత్తు సంస్కరణలు అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచడం వల్ల , పెట్రోల్ , డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, రవాణా చార్జీలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలకు అదుపులేకుండా పోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ ప్రజలపై అనేక ఆర్ధిక భారాలు మోపుతున్నాయన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. వామపక్ష పార్టీలు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, ప్రధాన ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వం విద్యుత్తు బిల్లులు పెంపుకు అనుకూలమా.. వ్యతిరేకమా తమ ఓటు ద్వారా తెలియజేయాలన్నారు. ఈ ప్రజా బ్యాలెట్ ఫలితాలను బట్టి వామపక్షపార్టీలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాయన్నారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గించకుండా , వ్యవసాయ మోటార్లకు మీటర్లు భిగించడం దారుణమన్నారు. విద్యుత్తు సరఫరాలు ఎటువంటి ఇబ్బందులు లేవని, వ్యవసాయ పంపు సెట్లకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం సరైనది కాదన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడమే ధ్యేయంగా ఎట్టుకొని పాలన సాగిస్తుందన్నారు. విద్యుత్తు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.అధాని, అంబానిలకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పరిధిలోని విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలను కార్పోరేట్ శక్తులకు అప్పగించి వారి నుంచి విద్యుత్తు అధిక ధరలకు కొనుగోలు చేసి ప్రజలపై ఈ ప్రభుత్వం భారాలు మోపుతుందన్నారు.ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ లక్ష్మీరెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాంబాబులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల క్రిష్ణయ్య, సిపిఐ నాయకులు రామరాజు, సిఐటియు నాయకులు కె.అజరుకుమార్, సిపిఐ రైతు సంఘం నాయకులు ఎస్‌కె షాన్‌వాజ్, సిరాజ్, సిఐటియు నాయకులు కత్తి శ్రీనివాసులు, కిన్నెర కుమార్ తదితరులు పాల్గొన్నారు.










