ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం గణేనాయక్ భవన్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారభమై 2 నెలలు పూర్తి కావస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. విద్యా రంగాన్ని ప్రతిష్టాత్మకంగా సమూలమైన మార్పులు తెస్తామని చెబుతున్న వైసిపి ప్రభుత్వం సకాలంలో పుస్తకాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనె కుట్ర చేస్తోందా.. అంటూ ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాలపై అధికారులను అడిగితే స్పందించడం లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేలా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆర్‌డిఓ, తహశీల్దార్ కార్యాలయాల వద్ధ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈనెల 19న జిల్లా విద్యార్థులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. పాఠ్యపుస్తకాలు ఇచ్చేంత వరకు దశలవారీగా ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత, ముఖ్య నాయకులు వెంకీ, సిద్ధు, సూర్య ప్రకాష్, గిరి, బీమా, అశోక్, వంశి, వరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్










